కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తుంటే ఈ ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమైనట్లే కనిపిస్తోంది. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ విజయానికి చేరువగా వెళ్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ‘ఆపరేషన్ కమలం’ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది.
గెలుపొందిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు సాయంత్రానికల్లా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేతలందరినీ బెంగళూరు చేర్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణంలో ట్విటర్‌లో తమ అగ్రనేత రాహుల్ జోడో యాత్ర వీడియోను కాంగ్రెస్ పోస్టు చేసింది. ‘నేను అజేయంగా ఉన్నాను. నేను నమ్మకంగా ఉన్నాను. నన్నెవ్వరూ ఆపలేరు’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలను జోడిచింది. ప్రస్తుత ఆధిక్యానికి జోడో యాత్రే కారణమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.