ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల తరహాలో కర్ణాటక ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నుంచి కార్యలయాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యురప్ప నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో మంత్రి వర్గం అధికార వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది. త్వరలోనే కీలక కార్యాలయాలను తరలించడానికి సిద్దమైంది.
ఇటీవల కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప కూడా ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని కార్యాలయాలను వారికి దగ్గరగా తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆయన ఆ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో జగన్ సర్కార్ కి కొత్త బలం వచ్చినట్లు అయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కర్ణాటక ప్రభుత్వానికి బిజెపి అధిష్టానం కూడా అంగీకారం తెలిపింది. ఇది కేంద్ర పరిధిలోని అంశం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ అడ్డంకి లేకుండా ముందుకి వెళ్తుంది. ఇప్పుడు ఈ నిర్ణయంపై అక్కడి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జగన్ తీసుకున్న స్థానికులకే 75 శాతం ఉద్యోగాల నిర్ణయాన్ని కర్ణాటక కూడా తీసుకుంది.
ఇన్నాళ్ళు రాష్ట్రంలో విపక్షం అడ్డుకోవడం అన్ని విధాలుగా ఆగిన జగన్ సర్కార్ ఇప్పుడు ఇక ఈ విషయంలో దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం వచ్చింది. అమరావతి నుంచి కొన్ని కార్యాలయాలను విశాఖపట్నం, కర్నూలుకు తరలిస్తామని జగన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటున్నారు.