కర్ణాటక మంత్రి ఉమేశ్‌ కత్తి హఠాన్మరణం

-

కర్ణాటక పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్‌ విశ్వనాథకత్తి (61) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. డాలర్స్‌ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన మంత్రిని చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఇచ్చిన చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు.

బెళగావి జిల్లా హుక్కేరి నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఐదుసార్లు మంత్రిగా సేవలందించారు. మొదటిసారి జనతాదళ్‌ తరఫున 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1999లో జేడీ (యూ) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి 2004లో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు మినహా, మరెప్పుడూ ఆయన ఓటమి ఎరుగలేదు.

ఇప్పటికే రెండుసార్లు గుండెపోటు గురైన కత్తికి.. వైద్యులు స్టంట్ వేశారు. హుక్కేరి నుంచి భార్య లీల, కుమారుడు నిఖిల్‌, కుమార్తె స్నేహ బెంగళూరుకు బయలుదేరారు. ఉమేశ్‌ కత్తి చిక్కోడి తాలూకా, ఖడకలాట గ్రామానికి చెందినవారు. ముఖ్యమంత్రి బొమ్మై, ఇతర మంత్రివర్గ సభ్యులు హుటాహుటిన రామయ్య ఆసుపత్రికి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news