బ్రహ్మాస్త్ర మూవీ వసూళ్లపై ది కశ్మీర్ ఫైల్స్​ డైరెక్టర్​ సెటైర్

-

వాస్తవ సంఘటనల ఆధారంగా, తక్కువ బడ్జెట్‌లో రూపొంది, ఊహించని విజయాన్ని అందుకుంది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ‘బ్రహ్మాస్త్ర’ అధిగమించిందంటూ బాలీవుడ్‌కు చెందిన పలు వెబ్‌ సైట్లు కథనాలు రాశాయి. సంబంధిత వివరాలను స్క్రీన్‌షాట్‌ తీసి, ట్విటర్‌ వేదికగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి వ్యంగాస్త్రాలు విసిరారు.

‘‘హా.. హా.. హా! వారెలా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ను అధిగమించారో నాకు తెలియదు. కర్రలు, రాడ్లు, రాళ్లు, ఏకే 47 లతోనో, డబ్బుల కోసం పీఆర్‌లు ప్రచారం చేయటమో, తమ పలుకుబడితోనో.. ఇలా దేనితో మమ్మల్ని ఓడించారో అర్థం కావట్లేదు. బాలీవుడ్‌ చిత్రాలను ఒకదానితో ఒకటి పోటీపడనివ్వండి. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. అలాంటి మూసధోరణి రేసులో నేను లేను’’ అని వివేక్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలతోపాటు #NotBollywood అనే హ్యాష్‌ట్యాగ్‌ పెడుతూ నవ్వుల ఎమోజీ జతచేశారు. వివేక్‌ కామెంట్లను కొందరు నెటిజన్లు సమర్థించగా మరికొందరు ‘మీరు బాలీవుడ్‌కి చెందినవారు కాదా?’ అని తమదైన శైలిలో విమర్శిస్తున్నారు.

జమ్మూ-కశ్మీర్‌లోని హిందూ పండిట్లు 1990ల్లో పెద్ద ఎత్తున వలసలు వెళ్లిన నేపథ్యంతో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ రూపొందింది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లో రూ. 200 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. విడుదలైన 9 రోజుల్లోనే ‘బ్రహ్మాస్త్ర’ రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరినట్టు వివేక్‌ షేర్‌ చేసిన ఫొటోల్లో కనిపించింది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ నాయకానాయికలుగా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమిది. ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news