కత్తి కార్తీక వెనకున్న ఆసలు పాత్రధారులెవరు…?

-

బిగ్‌బాస్‌ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ అయిన టీవీ యాంకర్‌ కత్తి కార్తీక ప్రస్తుతం వివాదాలలో కూడా అంతే ఫేమస్‌ అయింది. దుబ్బాక ఉపఎన్నికలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలో ఉంది కార్తీక. అసలు టీవీ యాంకర్‌ దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ఎందుకంత ఆసక్తి చూపిస్తోంది? ల్యాండ్‌ సెటిల్మెంట్‌లో మధ్యవర్తిత్వం వహించడం వెనక కిటుకు ఏంటి? తెరపై కత్తి కార్తీక పాత్రధారి అయితే.. వెనకున్న సూత్రధారులు ఎవరు ? ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చుట్టూ బౌన్సర్లు. బెంజ్‌, రేంజ్‌రోవర్‌, స్కోడా కార్లు. అసలు మేడమ్‌ ఎంట్రీ పాతికేళ్ల ఎక్స్‌పీరియన్స్‌డ్‌ పొలిటీషియన్‌లా ఉంటుంది. ఇది ఈ ఎన్నికల్లో ఒక మామూలు పొలిటీషియన్‌ కన్నా ఎక్కువ హడావిడి చేస్తున్నట్టు జనాల్లో వినిపిస్తున్న టాక్‌. హైకోర్టు సీనియర్‌ లాయర్‌ను అడ్వయిజర్‌గా పెట్టుకుని నామినేషన్‌ వేశారట. ఆమె చుట్టూ ఎప్పుడూ నలుగురు బౌన్సర్లు ఉంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోయిన వెంటనే దుబ్బాకలో వాలిపోయిన కత్తి కార్తీక.. ఇక్కడో ఇల్లు కూడా తీసుకున్నారు. ఇంటి ముందు ఎప్పుడూ BMW, రేంజ్‌ రోవర్‌ స్కోడా కార్లు ఉంటాయి. ప్రచారానికి వాటిల్లోనే వెళ్తారామె. వెంట ఎప్పుడూ పది మంది ఉంటారు. ఒక ఫక్తు రాజకీయ నేత చేసే హడావిడికి ఏమాత్రం తక్కువ లేదు. పైగా నామినేషన్‌ విత్‌డ్రా చేయమని ఒత్తిళ్లు ఉన్నాయట. ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో ఆమెపై దాడి జరిగింది. ఇది ఎన్నికల స్టంట్‌లో భాగమో ఏమో కానీ కావాల్సినంత ప్రచారమైతే వచ్చేసింది.

హైదరాబాద్‌లోని పలువురు బిగ్‌ షాట్‌లు, సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నవారు తెర వెనక కథ నడిపిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారట. ఇదంతా ఓ ఎత్తు అయితే.. ఇప్పుడు అమీన్‌పూర్‌ ల్యాండ్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించి కోటి రూపాయలు కాజేశారన్న ఆరోపణలపై కత్తి కార్తీకపై కేసు నమోదైంది. భూములు, ఆస్తులు కబ్జాల విషయంలో ముందు భయపెట్టడం, బెదిరించడం, వీలు కాకపోతే కత్తి కార్తీకను పావుగా వాడుకొని బ్లాక్‌మెయిల్‌ చేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఈ విషయంలో అసలైన వ్యక్తులు ఎక్కడా కార్తీకతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా వ్యూహాత్మకంగా ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ క్రమంలో ఎక్కడా తన వెనక ఉండే వారి పేర్లు బయటకు రాకుండా కార్తీక జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా వెళ్లి తెర వెనక సూత్రధారులను కలిసి మాట్లాడి వస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి అటు దుబ్బాక ఉప ఎన్నిక ఇటు అమీన్‌పూర్‌ ల్యాండ్‌ గొడవతో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు కత్తి కార్తీక. మరి.. ఈ ఎపిసోడ్‌లో సూత్రధారులు బయటపడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news