ప్రతి ఇంటి మీద జాతీయ జెండాఎగరాలి : సీఎం కేసీఆర్

-

రాష్ట్రంలోని ప్రతి ఇంటిమీద జాతీయ పతాకం ఎగరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన 1 కోటి 20 లక్షల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశఇంచారు. గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ఆర్డర్​ ఇవ్వాలని సూచించారు. దీనికి సంబంధించిన ఖర్చంతా రాష్ట్ర సర్కారే భరిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద జాతీయ పతాకాన్ని అత్యున్నతంగా ఎగరవేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ప్రభుత్వ వాహనం మీద జాతీయ జెండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా జెండాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలోని ప్రజా సంచార ప్రాంతాలు, బస్ స్టాండ్లు ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, సినిమా హాల్లు, షాపింగ్ మాల్స్, పట్టణాల్లోని స్టార్ హోటళ్లు సహా ప్రధాన కూడళ్లు రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి కలగజేసేలా జాతీయ జెండా రెపరెపలాడేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్​ కుమార్​ను ఆదేశించారు.

పీజీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలు సహా గురుకులాలు తదితర ప్రభుత్వ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు సహా అన్ని రకాల విద్యాసంస్థల్లో పంద్రాగస్టుకు ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు మొత్తం 15రోజుల పాటు ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు సీఎం కేసీఆర్. ఇందులో.. ఆటల పోటీలు, వ్యాస రచన పోటీలు, వకృత్వ పోటీలు, చిత్రలేఖనం పోటీలు, దేశభక్తిగీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర దేశభక్తిని ఉద్దీపన చేసే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి తగు చర్యలు తీసుకోవాలన్నారు.


పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు లెటర్ ప్యాడ్లమీద జాతీయ జెండా బొమ్మను ముద్రించుకోవాలని సీఎం సూచించారు.

వేడుకల్లో మీడియా యాజమాన్యాలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరిన ముఖ్యమంత్రి… 15 రోజుల పాటు పత్రికల మాస్టర్ హెడ్స్ మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించాలని విజ్ఞప్తి చేశారు. టీవీ ఛానళ్లలో 15 రోజుల పాటు జాతీయ పతాక చిహ్నం నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలని మీడియా యాజమాన్యాలను కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ సప్తాహం సందర్భంగా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news