తెలంగాణ అస్థిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్ ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని.. బీఆర్ఎస్ ఓ జనతా గ్యారెజ్ మాదిరిగా మారిందన్నారు. ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించనున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ పై నమ్మకం లేదని.. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంట్ ఎప్పుడూ పోతుందో తెలియడం లేదన్నారు. వీళ్లను నమ్ముకుంటే ఏదో రకంగా మోసం చేస్తారని అందుకే సభ నిర్వహణ కోసం 200 జనరేటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. అతిపెద్ద బహిరంగ సభ కాబోతుందన్నారు. కేసీఆర్ ను చూసేందుకు ఆయన మాట వినేందుకు గ్రామ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. రైతులు ఎడ్లబండ్ల పై సభ కోసం తరలివస్తున్నారన్నారు.