తెలంగాణాలో క్రమంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్య౦లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణాలో 13 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా తెలంగాణా ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో 7 రోజుల కార్యాచరణ అమలు చేస్తుంది.
హైదరాబాద్ లో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ రోజు తెలంగాణా ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడానికి సిద్దమవుతుంది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొంటారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరు అవుతారు.
ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ పై ప్రభుత్వం చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసే యోచనలో తెలంగాణా సర్కార్ ఉంది. అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ప్రభుత్వం సమాయత్తం అయింది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్దమవుతుంది. ప్రజల సహకారం ఉండాలని కోరుతుంది.