తెలంగాణా శాసన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీని నమ్ముకుంటే పట్టాల్సిందేనని ఆయన విమర్శించడం గమనార్హం. కాంగ్రెస్‌తో విసిగిపోవడం వల్లే దేశ ప్రజలు బీజేపీని గెలిపించారని కెసిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సిఎం ఆరోపించారు. పన్నులు, వసూలు చేసే బాధ్యత మాత్రమే కేంద్రానికి ఉందని అన్నారు ఆయన.
జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందని చట్టంలో పెట్టారని గుర్తు చేసిన అయన… దానిని కేంద్రం పట్టించుకోవడం లేదని సిఎం ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా రావడం లేదని ఆయన దుమ్మెత్తి పోశారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 3900 కోట్లు కేంద్రం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని కెసిఆర్ ఈ సందర్భంగా స్పష్ట౦ చేసారు. బీజేపీ ఇప్పటికైనా నీచ బుద్ధి మానుకోవాలని అయన సలహా ఇచ్చారు. తాము కేంద్రానికి రూ. 50 వేల కోట్లు ఇస్తే…రూ. 24 వేల కోట్లు తెలంగాణకు ఇస్తోందన్న ఆయన రాష్ట్రాల అభివృద్దికి కేంద్రం సహకారం తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా కేంద్రం విధానాలను కెసిఆర్ తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. సిఏఏ ఎన్నార్సీలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.