ఖమ్మం సభకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది. ఈ నెల 18వ తేదీన బీఆర్‌ఎస్ సభ జరుగనుంది. అయితే, ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం సభ బాధ్యతలను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించింది. దశ దిశా ఆయననే అంటూ ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఖమ్మం సభ బీఆర్ఎస్కు చాలా ముఖ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
జాతీయ నాయకులు ఈ సభకు వస్తున్నందున.. విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతున్న తరుణంలో జరుగుతున్న చారిత్రక సభకు ఎనలేని ప్రాధాన్యం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే దశగా నిలువబోతోందని హరీశ్‌రావు అన్నారు.