తెరాస అధినేత సీఎం కేసీఆర్ హైదారబాద్ ని విశ్వనగరంగా మార్చేందుకు తన మార్క్ వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా … శనివారం ప్రగతి భవన్లో రాష్ట్ర ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి రాజధాని వెన్నెముక, హైదరాబాద్ ప్రగతి పై ఆదారపడే రాష్ట్ర భవిష్యత్ ఉంటుంది అంటూ వివరించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని.. దేశంలోని 7 పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటని చెప్పారు.
నగరంలో కనీసం 100 పార్కుల అవసరం ఉంది.. ‘హైదరాబాద్‌ను రక్షించడానికి రేపటి భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. హైదరాబాద్ విషయంలో ఏ ఒక్క మార్పు చేయాలన్నా.. నిర్ణయం తీసుకోవాలన్నా… అందులో ఒక్క పేరాను మార్చాలంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకునేంత స్థిరంగా నియమావళి రూపొందించాలన్నారు.
ప్రభుత్వం కేవలం చట్టాలను అమలు పరచడమే కాకుండా రాష్ట్రాభివృద్దిని సులభతరం చేస్తూ ఒక ఉత్ప్రేరకంగా, ఉద్దీపనకారిగా తన పాత్రను నిర్వహిస్తుందన్నారు. కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు, రవాణా, భద్రత విషయాల్లో మరింత పటిష్టమైన ప్రణాళిక రూపొందించి భాగ్యనగరాన్ని మరింత ఆదర్శవంతంగా మార్చాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.