బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరస అల్పపీడనం, వాయుగుండాలు దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు కూడా క్రియాశీలకంగా ఉండటంతో వర్షాల తీవ్రత ఎక్కువ అవుతోంది. తాజాగా కేరళ రాష్ట్రానికి కూడా వర్షాల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం మొత్తం వర్షాలతో అల్లాడుతోంది. ప్రస్తుతం కేరళ రాష్ట్రానికి హెచ్చరికలు చేసింది ఐఎండీ.
నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చిరించింది. నేడు, రేపు తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి , ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అక్టోబర్ 1 నుండి 12 మధ్య కాలంలో కేరళలో 86 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్ 1 నుండి 12 వరకు సాధారణ వర్షపాతం 392.9 మి.మీ. అయితే, ఆ సమయంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 732.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలయజేసింది.