కరోనా వైరస్ను నాశనం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేనప్పటికీ.. వైద్యులు మాత్రం మలేరియా డ్రగ్స్, హెచ్ఐవీ మందులు, పలు యాంటీ వైరల్ మెడిసిన్, జ్వరం మందులతో కరోనాను తగ్గిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మాత్రం ఈ మందులు పనిచేయడం లేదు. దీంతో అలాంటి వారికి వైద్యులు ప్లాస్మా థెరపీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం అమెరికా, చైనాల్లో ఉపయోగంలో ఉంది. అయితే దీనికి మన దేశంలో ఇప్పటి వరకు అనుమతి లేదు. కానీ Indian Council for Medical Research (ICMR) కరోనాకు ప్లాస్మా థెరపీ చేసుకోవచ్చని తాజాగా అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ విధానాన్ని ఉపయోగించిన తొలి రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది.
కరోనా వైరస్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించేందుకు కేరళ రాష్ట్రానికి ICMR తాజాగా అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా ఎమర్జెన్సీ పేషెంట్లకు ప్లాస్మా థెరపీ విధానంతో చికిత్స చేయనున్నారు. ప్లాస్మా థెరపీలో కరోనా వచ్చి నయం అయిన రోగి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్రమంలో కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ఈ విధానం ద్వారా రోగులను బతికించేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ప్లాస్మా థెరపీలో ఒక వ్యక్తి నుంచి సేకరించే ప్లాస్మాతో రెండు డోసులు మాత్రమే తయారు చేయవచ్చని ICMR తెలియజేసింది. ఒక డోసు వ్యక్తికి సరిపోతుందని.. అయితే ప్లాస్మాను సేకరించేందుకు కరోనా వచ్చి నయం అయిన వ్యక్తులను ఒప్పించాల్సి ఉంటుందని.. ICMR తెలిపింది. ఇక అమెరికా, చైనాలలో ఇప్పటికే ఈ విధానం సక్సెస్ అయినందున.. మన దేశంలోనూ దీన్ని ప్రస్తుతం ప్రారంభించారు. దీంతో ఎంతో మందికి లాభం కలగనుంది. అయితే ఈ విధానం చాలా ఖర్చుతో కూడుకున్నది కనుక.. కేవలం అత్యవసర స్థితి ఉన్న కరోనా పేషెంట్లకు మాత్రమే ఈ విధానంలో చికిత్స చేయనున్నారు..!