అనకొండ” ఇప్పుడు ఈ పేరు వింటే కేరళ జూ భయపడిపోతుంది… సాధారణంగా అనకొండ పేరు చెప్తేనే చాలా మంది వణికిపోతారు. అసలు దాన్ని చూడటానికి కూడా భయపడుతూ ఉంటారు. మన దేశంలో అవి చాలా తక్కువ… ఎక్కడో జులో మినహా మనకు కనిపించవు… అందుకే కేరళ రాజధాని తిరువనంతపురంలోని జూ అధికారులు ప్రత్యేకంగా శ్రీలంక నుంచి రెండు నెలల క్రితం అయిదు ఆడ, రెండు మగ అనకొండలను తీసుకొచ్చారు. వీటి కోసం భారీగానే అధికారులు ఖర్చు చేసి అత్యంత జాగ్రత్తగా వాటిని తీసుకొచ్చారు.
రెండు అనకొండలు బ్యాక్టీరియా బారిన పడి గత నెల మరణించాయి… మరొకటి జతకట్టే సమయంలో మరణించింది. నాలుగు రోజుల క్రితం అరుంధతి అనే అనకొండ కూడా మరణించింది. ఇప్పుడు మూడు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి. వాటి మరణం గురించి పరిక్షలు చేసిన వైద్యులు ఎంటమోబియా అనే బ్యాక్టీరియా సోకి అవి మరణిస్తున్నాయని… అందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే వాటి మరణాలను ఆపలేకపోతున్నామని వైద్యులు తెలిపారు. మిగిలిన మూడు అనకొండలకు కూడా ఇదే బ్యాక్టీరియా సోకినట్టు అధికారులు గుర్తించారు.
అయితే ఇక్కడ అధికారులు మరో ఆందోళనకర విషయం చెప్పారు. మిగిలిన సర్ప జాతులకు కూడా ఈ బ్యాక్టీరియా సోకుతుందని వారు గుర్తించారు. మంగళవారం సాయంత్రం వైద్య పరిక్షలు చేసి కొన్ని భారీ సర్ప జాతులకు అది సోకిందని వారు గుర్తించారు. అవి దూరంగా ఉన్నా సరే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అధికారులకు అంతుబట్టడం లేదు. ముఖ్యంగా కొండ చిలువులు సహా… అరుదైన కొన్ని సర్ప జాతులకు ఇది సోకుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వారు నివేదిక అందించి… మిగిలిన అనకొండలను తరలించే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.