బెజవాడ రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేక పంథాను ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్న ఎంపీ కేశినేని నాని.. టీడీపీలో ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పటికే టీడీపీలో ఆయన అసమ్మతి నేతగా కొనసాగుతూనే కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకూల వ్యాఖ్యలు చేస్తూ.. ఉండీ ఉండనట్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పైగా అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయన బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారు. అయితే, ఆయన పార్టీ మారనని చెబుతున్నా.. చేస్తున్న పనులు, వేస్తున్న సటైర్లు మాత్రం టీడీపీని తీవ్రస్థాయిలో ఇరుకున పెడుతున్నాయి.
అదే సమయంలో విజయవాడలోని పార్టీ నేతలతోనూ ఆయన అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కృష్ణా జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లోనూ నేతలతో ఆయన వైరం పెట్టుకున్నారు. ఇదిలావుంటే, ఇప్పుడు కొత్త ప్రతిపాదనతో ఎంపీ రగడకు దిగుతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్ ఎవరూ లేరు. గత ఏడాది ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అమెరికా వెళ్లిపోయారు. ఇక, అప్పటి నుంచి ఇక్కడ పార్టీ బాధ్యతలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
దీంతో ఎంపీ కేశినేని నాని తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ నాయకుడు, గతంలో ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిపోయిన నాగుల్ మీరాకు ఈ పోస్టు ఇవ్వాలని తాజాగా చంద్రబాబుకు లేఖరాసినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. నాగుల్ మీరా చాలా కాలంగా నానికి అనుకూలంగా చక్రం తిప్పుతున్నారు. గత ఏడాది టికెట్ విషయంలోనూ ఆయన దూకుడు ప్రదర్శించినా.. నాని జోక్యం చేసుకుని కూల్ చేశారని, అవకాశం వచ్చినప్పుడు పదవి ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చారని అప్పట్లోనే ప్రచారం సాగింది.
ఇక, ఇప్పుడు ఇదే సీటుకు ఇంచార్జ్ స్తానాన్ని మీరాకు ఇవ్వాలంటూ బాబుకు లేఖ రాయడంపై జలీల్ వర్గం ఫైర్ అవుతోంది. మరి బాబు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికే నాని కుమార్తెకు విజయవాడ మేయర్ పీఠం ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పశ్చిమ నియోజకవర్గంలో నాని జోక్యంపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సైతం గుర్రుగానే ఉన్నారు.