ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర నిపుణుల కమిటీతో ఇవాళ రెండున్నర గంటలపాటు విజయసాయి రెడ్డి సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్టు మారిన వ్యయ అంచనాల ఆమోదానికి ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సుముఖం వ్యక్తం చేసింది. గత పర్యటన సందర్బంగా ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని.. పరిష్కార మార్గాలను అన్వేషించామని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని.. త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా , సంబంధిత రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు చేస్తారు. పెండింగ్ అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తారని.. పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చామని వివరించారు. పునరావాసంతో సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయని.. రెవెన్యూ లోటు పై చర్చించామన్నారు. బడ్జెట్ సమయంలో బిజీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయం ఇచ్చారని పేర్కొన్నారు.