ఖానాపూర్-మంచిర్యాల రోడ్డు మూసివేత

-

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి మంచిర్యాలకు వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల నేపథ్యంలో ఈ రోడ్డుపై రాకపోకలు నిలిపివేసినట్లు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంచిర్యాలకు వెళ్లేవారు ఖానాపూర్-మెట్ పల్లి- జగిత్యాల నుంచి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. మంచిర్యాల నుంచి నిర్మల్ కు వచ్చే వాహనదారులు జన్నారం, ఉట్నూర్, గుడిహత్నూర్ రోడ్డు మార్గాల్లో నిర్మల్ కు చేరుకోవాలని చెప్పారు.

నిర్మల్ జిల్లాలో ఇటీవల భారీ వరద తాకిడికి దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మత్తులను రెండ్రోజుల క్రితం మొదలుపెట్టారు. హైదరాబాద్ ​కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఈ పనులు చేస్తోంది. గ్యాస్ వెల్డింగ్​తో దెబ్బతిన్న వరద గేట్ల రేకులను తొలగిస్తున్నారు. అలాగే నిర్మల్​కు చెందిన మెకానిక్‌లు చెడిపోయిన గేట్ల మోటర్లను తొలగిస్తున్నారు. మరమ్మతు పనులు వీలైనంత వేగంగా చేస్తున్నారని జిల్లా అధికారులు తెలిపారు.

ఇటీవల కడెం ప్రాజెక్టుకుకు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఈ వరదతో గేట్లలో చెట్లు, కొమ్మలు ఇరుక్కొని ఆనకట్ట సహా పరీవాహక ప్రాంతమంతా గందరగోళంగా మారింది. ప్రాజెక్టులోని 18 గేట్లలో 1, 2 నెంబరు గేట్ల కౌంటర్‌ వెయిట్‌ కొట్టుకుపోగా 12వ నెంబరు గేటు తెరుచుకోనేలేదు. నాలుగో నెంబరు గేటు పగుళ్లు తేలింది. జేసీబీలు, క్రేన్‌ల సాయం లేకుండా ఇప్పటికిప్పుడు గేట్లలో చేరిన చెత్తను తొలగించే పరిస్థితి లేదు.

భారీగా చెత్త చేరడంతో… కడెం ప్రాజెక్టు గేట్లు మూసివేసే పరిస్థితి కనిపించలేదు. మొత్తం 18 గేట్లలో జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినవి తొమ్మిది గేట్లు కాగా…, ఇండియన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినవి మరో 9 గేట్లు. వరదతో భారీ వృక్షాలు ఆనకట్టపై వచ్చి చేరడంతో వాటిని తొలగించడం కష్టంగా మారింది. మరమ్మతుల అనంతరం మళ్లీ గేట్లు మూసిన తరువాత వర్షాలు కురిస్తేనే… ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news