పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన గురువారం ఎగువ సభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్‌కు లేఖ రాశారు. నూతన పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యం తీవ్ర అంశమని, దీనిపై సభలో చర్చ జరపాలని అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని లేఖలో ఖర్గే కోరారు.
267 నిబందన కింద సభలో ఈ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. లోక్‌సభలోకి బుధవారం ఆగంతకులు ప్రవేశించి గ్యాస్‌ను వదలడం తీవ్ర భద్రతా వైఫల్యమని, దీనిపై తాను సహచరం ఇండియా పార్టీల సభాపక్ష నేతలతో సంప్రదింపులు జరపగా ఈ అంశంపై రాజ్యసభలో 267 నిబంధన కింద చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమైందని లేఖలో ఖర్గే ప్రస్తావించారు.
ఈ అంశం తీవ్రత దృష్ట్యా ఈ వ్యవహారంపై సమగ్ర చర్చ చేపట్టి కేంద్ర హోంమంత్రి సమాధానం ఇచ్చేవరకూ ఎలాంటి ఇతర అంశాలనూ చేపట్టరాదని కోరారు.కాగా, పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సభలో చర్చ జరగాలని, అమిత్ షా సమాధానం ఇవ్వాలని అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, శశి థరూర్ కూడా డిమాండ్ చేశారు.