ఐపీఎల్ కు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే వచ్చే ఏడాది జరగబోయే మినీ వేళానికి ముందు ప్రస్తుతం జట్లు ఆటగాళ్లను షఫీల్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పొలార్డ్ ను వదులుకోవాలని ముంబై నిర్ణయించుకుంది. ఈ లోపే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పొలార్డ్ ప్రకటించాడు.
ఐపీఎల్ నుంచి రిటైర్ అయినప్పటికీ ముంబై ఇండియన్స్ నుంచి మాత్రం తాను దూరం కావడం లేదని పొలార్డ్ తెలిపాడు. ఐపీఎల్ లో ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్ గా, యూఏఈ లీగ్ లో ఎంఐ ఎమిరేట్స్ లో ఆటగాడిగా బాధ్యతలు స్వీకరించడానికి తాను అంగీకరించానని వెస్టిండీస్ క్రికెటర్ వెల్లడించారు.
ఆటగాడిగా నుంచి కోచ్ గా మారబోతున్న తాను కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నాడు. ఐపిఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు అయినా ముంబై ఇండియన్స్ కు 13 సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని పోలార్డ్ తెలిపాడు. ఇన్నేళ్లలో ముంబై జట్టు తనకు అన్ని విధాలా సపోర్ట్ చేసిందన్నారు.