ఏపీలో కొత్తగా 100 ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటుకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో వంద పర్యావరణ పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. వెలగపూడి లోని సచివాలయంలో మంగళవారం అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.
ప్రతి అటవీశాఖ డివిజన్ పరిధిలో కనీసం 5 ఎకో టూరిజం ప్రాజెక్టులు నెలకొల్పాలని సూచించారు. విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త జంతువులను తీసుకురావాలని మంత్రి చెప్పారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్ వరకు ట్రామా లేదా రోప్ వే ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జన నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జగనన్న లేఅవుట్లలో నాటేందుకు మొక్కలను సమకూర్చాల్సి ఉందన్నారు.