ఉద్యోగుల తరుపున పోరాటం చేస్తే కేసీఆర్, ఆయన కుటుంబం ఎందుకు భయపడుతోందని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసు అధికారులు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని కోరుతున్నానని అన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పోరాటం చేస్తుంటే.. పోలీసులు ఎందుకు దాడి చేశారని మండిపడ్డారు. గడ్డపారలు, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి కార్యాలయంపై ఎందుకు దాడి చేాయాల్సి వచ్చిందని పోలీసులను ప్రశ్నించారు. సీసీ కెమెరా పుటేజీలను తీసుకెళ్లడంతో పాటు మహిళా కార్యకర్తలపై కూడా అమానవీయంగా దాడి చేయడం, దురుసుగా ప్రవర్తించారని పోలీసులను విమర్శించారు.
ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి చేశారా..? అని అన్నారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కొలేకనే అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకు, నేతలను బీజేపీ కేంద్ర నాయకత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ధర్నా చౌక్ లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తే తప్పు లేదు కానీ… ప్రతిపక్షాలు నిరసన తెలుపుతామంటే.. అనుమతులు ఇవ్వరా.. అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడారని.. ఇలాంటి ఘటనలను సహించరని కిషన్ రెడ్డి అన్నారు. ఇంత నిర్భంధం తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు చూడలేదని అన్నారు.