డీజీపీకి కిషన్‌రెడ్డి ఫోన్.. బండి సంజయ్ అరెస్టుకు గల కారణాలపై ఆరా

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కారణం చెప్పకుండా అరెస్టు చేయడంతో బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బండి సంజయ్​ను ఉంచిన బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా కాషాయ శ్రేణులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఈ క్రమంలో డీజీపీ అంజనీ కుమార్​కు ఫోన్ చేశారు. బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని ఆయణ్ను ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు.

కిషన్ రెడ్డికి సమాధానిస్తూ.. అంజనీ కుమార్.. కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news