కేసీఆర్‌కు కంటిలో నలుసు మాదిరిగా ఇబ్బంది పెట్టే నాయకుల్లో ఈటల రాజేందర్ ఒకరు అని చెప్పవచ్చు. అనేక ఏళ్ళు కేసిఆర్ పక్కనే పనిచేసిన ఈటల..ఇప్పుడు బిజేపిలో ఉన్నారు. కేసిఆర్ కావాలని ఆయన్ని పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోయేలా చేసిన విషయం తెలిసిందే. ఇక బిజేపిలో వచ్చిన దగ్గర నుంచి కేసిఆర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈటల పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ లో అన్నీ లొసుగులు తెలిసిన నేతగా ఉన్న ఈటలతో కేసీఆర్‌కు ఎప్పటికైనా చిక్కులే.
అందుకే ఈటలని ఎలాగైనా నిలువరించాలని కేసిఆర్ చూస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఆ పని చేయలేకపోయారు. హుజూరాబాద్ అంటే తన కంచుకోట అని ఈటల నిరూపించారు. ఇక ఉపఎన్నికలో నిలువరించలేకపోయిన..అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఈటలకు చెక్ పెట్టాలని కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా హుజూరాబాద్ ని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ అభ్యర్ధిగా ఎవరిని నిలబెడతారనే చర్చ నడుస్తోంది.
గత ఉపఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.కానీ అనూహ్యంగా ఆయన ఓడిపోయారు. అయితే ఇప్పుడు అక్కడ బిఆర్‌ఎస్ తరుపున కౌశిక్ రెడ్డి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈయన ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అలాగే విప్ పదవి ఇచ్చారు. అటు గెల్లుకు తాజాగా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు.
అయితే ఈ ఇద్దరిలో హుజూరాబాద్ సీటు కౌశిక్ రెడ్డికే దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎన్నికల బరిలో ఆయన్ని దించే ఛాన్స్ ఉంది. కానీ ఎవరు బరిలో ఉన్నా హుజూరాబాద్ బరిలో ఈటలకు చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి ఉంది. చూడాలి మరి ఈ సారి హుజూరాబాద్ పోరు ఎలా ఉంటుందో.