సస్సెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ఎలక్షన్ కమిటీ వేస్తామని.. మీటింగ్ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తమది క్యాడర్ బేస్డ్ పార్టీ అని.. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ మాదిరి.. డైనింగ్ టేబుల్ పై అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేమన్నారు. క్యాడర్ తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
ఇది ఇలా ఉంటె, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే కొన్ని రోజులు రాజకీయాలు వదిలేసి హిందూ రాష్ట్రం కోసం పనిచేకుంటానని వ్యాఖ్యానించారు రాజాసింగ్. తాను చచ్చినా కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని, స్వతంత్రంగా కూడా పోటీ చేసే ఆలోచన లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలందరూ తనవెంటే ఉన్నారని.. కొన్ని రోజుల్లో తనపై విధించిన సస్పెన్షన్ ను అధిష్టానం ఎత్తివేస్తుందన్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ముకేశ్ గౌడ్ తనయుడు, బీజేపీ లీడర్ విక్రమ్ గౌడ్ గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు.