స్వాతంత్య్ర దిన వేడుకల సాక్షిగా కోదాడ అధికార పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తన కుటుంబాన్ని మానసికంగా వేధించడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోదాడ పుర ఛైర్‌పర్సన్ వనపర్తి శిరీష ఆరోపించారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పట్టణ ప్రథమ పౌరురాలిగా గుర్తింపు ఇవ్వకుండా కోదాడ ఎంపీపీ, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌తో అవమానపర్చారని బోరున విలపించారు.
ఎమ్మెల్యే పుర పాలక వర్గంలో చీలికలు తెచ్చి, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని శిరీష ఆరోపించారు. అధికార, పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా తమను దూరంగా పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వివరించారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన నాకు భర్త తోడుగా వస్తుంటే అడ్డుకోవడం బాధాకరమన్నారు. ‘‘అన్నా మల్లన్నా నీ సోదరిగా వేడుకుంటున్నా నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయకన్నా’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్లు సుశీల, మాదార్, స్వామి నాయక్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.