తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ..కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన ముందుకెళుతున్నారా? అనే అనుమానాలు వచ్చేలా ఆయన పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి..ఆయనని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అలాగే మునుగోడు ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ కోసం ప్రచారం చేయకుండా..బిజేపి నుంచి పోటీ చేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి వివాదంలో చిక్కుకున్నారు.
దీనిపై కాంగ్రెస్ సైతం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. అప్పుడే ఆయన పార్టీ నుంచి బయటకెళ్తారని ప్రచారం జరిగింది. మళ్ళీ ఆయన పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తూనే ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డితో ఆ మధ్య సఖ్యత గా కనిపించారు. ఇంకా అంతా బాగానే ఉందనుకునే సమయంలో కోమటిరెడ్డి కోవర్టు అంటూ కాంగ్రెస్ లో ఓ వర్గం ప్రచారం చేస్తూ వస్తుంది. దీనిపై ఆయన సీరియస్ గా ఉన్నారు.
ఇలా పార్టీలో కోమటిరెడ్డి విషయంపై ఏదోక రచ్చ నడుస్తూనే ఉంది. ఇదే తరుణంలో ఆయన మరొక వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ పెట్టి కొన్ని రోజులు రాజకీయం నడిపించి..తర్వాత కాంగ్రెస్ లో చేరిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను తన అభిమానులు చంపేస్తారంటూ ఆయన కుమారుడికి కోమటిరెడ్డి ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
“నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిండు. వాడిని వదిలిపెట్టను. నీకు చెప్తున్నా. వార్నింగ్ ఇస్తున్నా. నా పేరు తీసుకుని మొన్న స్టేట్‌మెంట్ ఇచ్చిండు. మావాళ్లు మొన్నటిదాకా ఓపిక పట్టారు. ఇగ మా వల్ల కాదు సార్ అంటున్నారు. మేం బయటికి వెళ్ళినామ్. ఆడు యాడదొరికితే ఆడ చంపేస్తామంటున్నరు.” అని చెబుతూ కోమటిరెడ్డి..చెరుకు సుధాకర్ తనయుడుకు వార్నింగ్ ఇచ్చారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. సుధాకర్ అనుచరులు..కోమటిరెడ్డిపై మండిపడుతున్నారు. ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.