కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఒక బలమైన నేత. ప్రస్తుతం భువనగిరి ఎంపీ గా ఉన్న ఆయన… ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉన్న నేతలలో ఒకరు. గత కొంత కాలం నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తున్న వారిలో ఈయన ఒకరు. అయితే ఆ పదవి ఎవరిని వరిస్తుంది అనేది ఇంత వరకు క్లారిటీ లేదు. అయితే ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
దీనిపై పలు సందేహాలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తనకు టీసీసీ చీఫ్ పదవి ఇవ్వకుంటే బీజేపీ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ రకంగా వెంకటరెడ్డి తెలియజేస్తున్నారు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయం పై వెంకటరెడ్డి మాట్లాడుతూ, నాలుగు ముఖమైన అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చేందుకు కలిశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. 3 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ఫార్మా సిటీని 19 వేల 333 ఎకరాలకు పెంచారని, ఫార్మా సిటీ వల్ల హైదరాబాద్ కు కాలుష్య తీవ్రత ఎక్కువ ఉంటుందని వెంకటరెడ్డి అన్నారు. ఎయిర్ పోర్టు దగ్గరలో కాకుండా ఫార్మా సిటీ వేరే చోట పెట్టాలని సూచిస్తున్నాని వెంకటరెడ్డి అన్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారి చేయాలన్న విన్నపాన్ని ప్రధాని ముందు ఉంచానని తెలిపారు. మూసీ నదిని శుభ్రం చేయడం కోసం 3 వేల కోట్లు అవసరం అవుతాయన మోదీకి తెలిపినట్లు వెంకటరెడ్డి అన్నారు. సివరేజ్ ప్లాంట్ అవసరాన్ని ప్రధానికి తెలిపినట్లు ఆయన అన్నారు . భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టాలని కూడా నరేంద్ర మోదీనీ కోరినట్లు తెలిసింది. అయినప్పటికీ ఒక కాంగ్రెస్ ఎంపీ వెళ్లి ప్రధానిని కలవడం వెనుక రాజకీయ వ్యూహం వేరే ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.