కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండున్నర నెలల వ్యవధిలో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతంత మాత్రమే సౌకర్యాలు, రహదారులు ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.వంద కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆలయాన్ని సందర్శించి మరింతగా అభివృద్ధి చేసేందుకు రూ.అయిదారువందల కోట్లైనా ఖర్చు చేస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా ఎక్కడెక్కడ ఏం నిర్మించాలన్న విషయమై మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో గుట్ట అభివృద్ధికి పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కసరత్తు చేపట్టారు. అది కొలిక్కి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆలయం చుట్టూ ఉన్న సుమారు రెండున్నర నుంచి మూడు వేల ఎకరాల అటవీ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ప్రధాన ఆలయ విస్తరణ, వివిధ ఆలయాలు, కల్యాణమండపం నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధమవుతోంది.