నియోజకవర్గంలో స్వపక్షం-విపక్షం రెండు ఆ వైసీపీ ఎమ్మెల్యే నేనా ?

-

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. చిటికేస్తే అధికారులు వస్తారని.. కనుసైగ చేస్తే అన్నీ పనులు అయిపోతాయని అనుకుంటారు. కానీ.. ఆయన పరిస్థితి మరోలా ఉందట. ధర్నాకు దిగితే కానీ ఏ పనీ కావడం లేదట. నెల్లూరు రూరల్‌ నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెరైటీ నిరసనలతో ఎప్పుడూ ప్రచారంలో ఉండేవారు. డ్రైనేజీ బురదలో దిగడానికి కూడా వెనకాడేవారు కాదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అందులోనూ ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. అయినా ఏ పనీ కావడం లేదట. దీంతో విపక్ష ఎమ్మెల్యే పాత్ర ఇప్పుడు పోషిస్తున్నారట…

విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ మార్గమైతే ఎంచుకున్నారో అదే పద్ధతిలో ఇప్పుడూ వెళ్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు కోటంరెడ్డి. సమస్యల పరిష్కారం కోసం ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీల నాయకులు ధర్నాలు చేయడం చూస్తుంటాం. లేదంటే సమస్యలున్నవారు రోడ్డెక్కుతారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరు వేరు. అధికారపార్టీ ఎమ్మెల్యే అయినా ధర్నా చేయడానికి, నిరసన తెలియజేయడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గరనే ముద్ర పడిపోయిందట. పైగా వైసీపీలో సీనియర్‌గా ఉన్న ఓ ఎమ్మెల్యే ఇలా రోడ్డెక్కడం అధికారపార్టీ నేతలకు కొన్ని సార్లు ఇబ్బందిగా మారుతోందట. విషయంపై పెద్దగా చర్చ జరగకుండా.. మరింత రచ్చ కాకుండా కోటంరెడ్డి చేసిన డిమాండ్స్‌కు ఓకే చెబుతున్నారట.

జిల్లాలో శ్రీధర్‌రెడ్డికి జాయింట్‌ కలెక్టర్‌కు పడటం లేదని టాక్‌. జేసీ పట్టించుకోరని శ్రీధర్‌రెడ్డి అనుచరులు గుర్రుగా ఉంటున్నారట. దీంతో తరచూ వివాదాలే. ఇటీవల ప్రభుత్వ డాక్టర్ల వేతనాల విషయంలో శ్రీధర్‌రెడ్డి ఎంచుకున్న మార్గం మరోసారి చర్చకు వచ్చింది. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పరిధిలోనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉంటుంది. కరోనా సమయంలో డాక్టర్ల కొరత లేకుండా నెలకు 70వేలు వేతనం ఇచ్చే ప్రాతిపదికన వైద్యులను నియమించారు. అయితే జీజీహెచ్ లో పనిచేసే దంత, ఆయుర్వేద వైద్యులకు నెలకు 50 వేలు మాత్రమే ఇస్తామని జేసీ చెప్పారట.

జాయింట్‌ కలెక్టర్‌ నిర్ణయంపై వైద్యులు ఆందోళనకు దిగారు. అయినా జేసీ లెక్క చేయలేదట. ప్రభుత్వంలో జాయింట్‌ కలెక్టర్‌కు చాలా పలుకుబడి ఉందని చెబుతారు. ఆ కారణంగానే ఆయన ఎవరి మాట వినరని అధికార పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఇదే సమస్యపై డాకర్టులు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చారు. దాంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్‌ను కలిసి మాట్లాడారు. అయినా నో ఛేంజ్‌. దీంతో ఆందోళన చేస్తోన్న డాక్టర్ల దగ్గరకు వెళ్లి.. శ్రీధర్‌రెడ్డి వారితో జతకలిసి దీక్షకు దిగారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నాకు దిగడంతో వైసీపీలోనూ.. ప్రభుత్వవర్గాల్లోనూ అలజడి రేగింది. జిల్లా మంత్రులు..పార్టీ పెద్దలు కలవర పడ్డారట. సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారనే సంకేతాలు పోతే పరువుపోతుందని భయపడినట్టు సమాచారం. వెంటనే డాక్టర్ల జీతాలపై కలెక్టర్‌తో ప్రకటన ఇప్పించి అప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా శ్రీధర్‌రెడ్డి దీక్షకు దిగితే కానీ సమస్య పరిష్కారం కాలేదన్న చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news