టీడీపీకి పట్టుకొమ్మ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ తమ్ముళ్ల మధ్య అలకలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై వారు అంతర్మథనం చెందుతున్నారు. తమను కనీసం సంప్రదించకుండానే చేసిన ఓ నియామకంపై వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా చీఫ్‌గా మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను చంద్రబాబు నియమించారు. నిజానికి ఈ నియామకంపై స్థానికంగా ఉన్న అగ్రనాయకులు మౌనం పాటిస్తున్నారు. కానీ, లోలోన మాత్రం ఉడికిపోతున్నారు. ఇదే విషయంపై వారిలో వారు తర్జన భర్జన పడుతున్నారు.
ఈ నియామకం చేసేటప్పుడు మేం ఉన్నామనే విషయం కనీసం తెలియదా? అనివారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇంతటి కీలక బాధ్యత అప్పగించేప్పుడు సీనియర్లను కూడా సంప్రదించరా? అని నిలదీస్తున్నారు. ఇదిలావుంటే, రాజమండ్రి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరింతగా తమ్ముళ్లు మండి పడుతున్నారు. దీనికి కారణం.. ఇప్పుడు రాజమండ్రి ఎంపీ స్థానానికి ఇంచార్జ్‌గా నియమించారు. రేపు జవహర్ కోరుతున్నట్టు ఆయనను కొవ్వూరుకూ ఇంచార్జ్‌గా నియమించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయని, దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని అంటున్నారు.
నిజానికి గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా జవహర్‌పై కొవ్వూరు నాయకులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న జవహర్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు, నిరసనలు కూడా చేశారు. దీంతో ఆయనను చంద్రబాబు అక్కడి నుంచి జవహర్‌ను తప్పించారు. మళ్లీ ఇప్పుడు జవహర్‌ను నియమించేలా పావులు కదులుతున్నాయన్న వార్తలతో వారు ఆందోళన చెందుతున్నారు.
జవహర్‌ను ఎట్టిపరిస్తితిలోనూ ఆమోదించేది లేదని, మరెవరికి ఇచ్చినా.. తాము అండగా ఉంటామని వారు మళ్లీ గళాలు వినిపిస్తుండడం గమనార్హం. దీంతో కొవ్వూరు టీడీపీలో మరోసారి అలజడి తెరమీదికి వచ్చింది. దీనిని చంద్రబాబు ఎలా సెట్ చేస్తారో ? చూడాలి.