బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే మంత్రి కిషన్ రెడ్డి సంబురాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దొంగల ముసుగులు తొలగిపోయాయి అని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ఎలుకలు బయటకు వచ్చాయి. స్కామ్‌లోని స్వామీజిలతో సంబంధం లేదంటూ ఇప్పుడు సంబురాలు చేసుకుంటున్నారు. మాకు సంబంధం లేదని భుజాలు తముకున్నవారే దొంగలను భుజాలపై మోస్తున్నారు. కుట్ర కేసు తమ జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకే కిషన్ రెడ్డికి ఇంత సంబురమా? అని కేటీఆర్ అడిగారు.
ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. ఇప్పుడేమో సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలపై, బీజేపీపై ప్రజాక్షేత్రంలో ఎప్పుడో విచారణ ప్రారంభమైందన్నారు. అసమర్థ పాలనతో ప్రజాక్షేత్రంలో బీజేపీ ఫెయిలైంది. కేసు సీబీఐకి వెళ్తే క్లీన్ చిట్ ఇవ్వడం పక్కా అని పబ్లిక్‌గా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించిన తీరుకు మీ నిస్సిగ్గు ప్రకటనలే నిదర్శనమన్నారు. ఒకప్పుడు సీబీఐకి కేసు వెళ్తే.. భయపడే పరిస్థితి.. నేడు సంబురాలు చేసుకుంటున్నారు. సీబీఐ సంస్థను బీజేపీ ఎంతగా నీరుగార్చిందో అర్థమవుతోందన్నారు.