దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దేశానికి దార్శనికతను చూపిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే తెలంగాణ సర్కార్ నడుస్తోందని అన్నారు. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం సాధించాలని ఆయన చెప్పారని వెల్లడించారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేడ్కర్ అని పేర్కొన్నారు.
“అంబేడ్కర్ తత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆచరణలో చూపింది. ఆయన లక్ష్యం సమానత్వం. తాను రాసిన రాజ్యాంగ దుర్వినియోగం అయితే స్వయంగా తానే దాన్ని తగులబెడతానని ఆయన అన్నారు. భాషా ఆధిపత్యాన్ని, ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఆయన వ్యతిరేకించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీకి పేరు పెట్టడానికి ఆయనకంటే మించిన, సరైన వ్యక్తి లేరు. అందుకే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి.” – కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి