మొన్నటి ప్రమాదంలో ఏ సంబంధమూ లేని ఒక అమాయకురాలు చనిపోవడం కేటీఆర్‌ను బాగా కలచివేసినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన ట్వీట్, తదనంతర పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి.
రెండు ప్రమాదాలు..
ముగ్గురి దుర్మరణం…
550 ఓవర్‌స్పీడ్ చలానాలు…
ఇదీ.. ప్రారంభించబడిన 20 రోజుల్లోనే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ‘ట్రాక్’ రికార్డ్.
పూర్తిగా ఐటీ కంపెనీ సమూహాల మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఎన్నోసార్లు ప్రత్యక్షంగా దీన్ని చూసిన పురపాలక శాఖామంత్రి తారకరామారావు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉండదల్సిందేనని చాలా గట్టిగా తీర్మానించుకున్నారు, దాని ఫలితమే నేటి ఈ రోడ్డు వంతెన నిర్మాణం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణం పూర్తయి, కేవలం 20 రోజులే అయింది. వన్‌వే ట్రాఫిక్ అయిన పుణ్యాన, ఎదురుగా ఏ వాహనమూ వచ్చే ప్రసక్తి లేదు. దాంతో కార్లు విచ్చలవిడిగా దూసుకుపోతున్నాయి. ఫ్లైఓవర్లపై గంటకు 40 కిమీ వేగంకంటే ఎక్కువగా పోరాదని నియమం విధించినా, దాన్ని పాటించేవారే కరువయ్యారు. ప్రతీవాడూ 100కు తగ్గకుండా, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో రయ్యిమంటూ వెళుతున్నారు. ఈ 20రోజుల్లోనే 550 ఓవర్‌స్పీడ్ చలానాలు విధించబడ్డాయంటే, జనాలు ఏ స్థాయిలో తెగబడుతున్నారో తెలిసిపోతోంది.
భయంకరమైన ట్రాఫిక్ సమస్య దీంతో తీరిపోతుందని, ఎంతో ఇష్టంగా కట్టించిన ఈ ఫ్లైఓవర్ మీద ఇలా వరుస ప్రమాదాలు జరగడం, అభంశుభం తెలియని అమాయకుల ప్రాణాలు గాల్లో కలవడం మంత్రిని తీవ్రంగా బాధపెట్టింది. రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఆయన మంత్రే అయినా, రాజధాని నగరంపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఇప్పటికే చాలాచోట్ట ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి, ప్రజలను ట్రాఫిక్ వెతలనుంచి దూరం చేస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ట్రా‘ఫికర్’ను పారదోలాలని కేటీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు.
శనివారం నాటి సంఘటన, నిజానికి హైదరాబాద్ వాసులను చాలా భయపెట్టింది. కింద ఇరుకైన రోడ్డు, ఓ పక్క మెట్రో బ్రిడ్జ్, మరోపక్క ఫ్లైఓవర్.. హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో అంతటా ఇదే పరిస్థితి. మెట్రో ట్రాక్, ఫ్లైఓవర్లు చాలా చోట్ల మెలికలు తిరిగే ఉన్నాయి. ఇంకా పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే దీనికి అదనం. ప్రక్కనున్న బిల్డింగులను తాకుతూనే వెళుతున్నాయి. ఏ మాత్రం బాధ్యత లేని యువత ఇలాంటి రోడ్లెక్కి ఇలా రేసింగ్‌లు చేస్తుంటే ఇక ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఏముంది? నగరంలో ఫ్లైఓవర్లు ఎక్కువయినా కొలది ఇటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువయ్యే అవకాశముంటుంది. ఎలాగూ మన నవయువ డ్రయివర్లు మారరు కదా. ఇంతా చేస్తే, మొన్నటి ప్రమాదానికి కారణమైన మిలన్‌కృష్ణకు వెయ్యి రూపాయలు ఫైన్ వేసి ఇంటికి పంపేసారు. నిజానికి తనపై హత్యానేరం మోపాలి.
అయితే, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ ఫ్లైఓవర్ ఆ ప్రాంతంలో ‘ఎస్ ఆకారంలో వంపు తిరిగింది. అకస్మాత్తుగా అంత టర్నింగ్ రావడంతో వాహనాలను ఆంత స్పీడ్‌లో నియంత్రించలేకపోతున్నారు. ఇక్కడ కూడా జరిగిందదే. అయితే, ముందునుంచీ కూడా కొంతమంది అవగాహనాపరులు, సాంకేతిక నిపుణులు ఈ టర్నింగ్ డిజైన్‌పై సందేహాలు వెలిబుచ్చారు. సాధారణంగా ఏ రోడ్డయినా వంపు తిరిగేప్పుడు, ఎడవవైపు తిరిగే కుడి పక్క, కుడివైపు తిరిగితే ఎడమపక్క రోడ్డు అంచును కొంచెం ఎత్తు పెంచుతారు. దీన్ని ‘బ్యాంకింగ్ ఆఫ్ రోడ్’ అంటారు. దీంతో పనిచేసే అపకేంద్ర బలం (Centrifugal Force), వాహనాన్ని నియంత్రణ కోల్పోకుండా మలుపు తిప్పుతుంది. ఈ విషయం తెలియకుండానే ఈ ఫ్లైఓవర్‌ను డిజైన్ చేసారని అనుకోలేం కానీ, తగినంత లేదేమోనని సివిల్ ఇంజనీర్ల అభిప్రాయం. నిజానికి సరిగ్గా మలుపు దగ్గర కింద కుడివైపు బయోడైవర్సిటీ పార్కు ఉంది. అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. దాన్లో కొంత స్థలాన్ని వాడుకునిఉంటే, ఇంత టర్నింగ్ ఉండేదికాదని, దాదాపుగా స్ట్రయిట్‌గా ఉండేదని కూడా ఒక వాదన. ఇవన్నీ ఇప్పుడు ప్రమాదాలు జరిగాక మెల్లగా బయటకొస్తున్నాయి.
ఇవన్నీ గమనించిన కేటీఆర్, ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించిన అన్ని రకాల అంశాలపై కూలంకషంగా దర్యాప్తు చేయాల్సిందిగా జిహెచ్‌ఎంసీ ఇంజనీర్లను, ట్రాఫిక్ కమిషనర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా ఒక స్వతంత్ర సంస్థ లీ అసోసియేట్స్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేసి, మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. ఇంకా చాలా నిర్మించాల్సిన ఫ్లైఓవర్లున్నాయి. ఈ అనుభవంతో వాటిని ప్రమాదరహితంగా నిర్మించవచ్చనేది మంత్రి ఆలోచన. వాహనదారుల తప్పులవల్ల ప్రమాదం జరిగి, వాళ్లకే ఏదైనా జరిగితే కనీసం వాదించడానికైనా అవకాశముంటుంది. కానీ, వాహనంతో అసలేమాత్రం సంబంధం లేని వ్యక్తులు, కనీసం ప్రమాదాన్ని ఊహించనివారు చనిపోవడం అతిపెద్ద విషాదం. దాన్ని అరికట్టడానికే కేటీఆర్ ఈ అంశాన్ని ఇంత సీరియస్‌గా తీసుకున్నారు.
– రుద్రప్రతాప్