రాజకీయాల్లో ఉన్నవారికి ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ఉంటాయని అంటారు. అయితే, వీటిని పూర్తిగా తిరగరాస్తాను. నేను ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తాను. అవినీతి రహిత, కుల రహిత, పూర్తి పారదర్శ కతతో కూడిన పాలిటిక్స్ చేస్తాను- అని రంగంలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అనేక రూపాల్లో ప్రజలకు దగ్గరైన మాటవిషయం. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయడంవల్లో.. వారి పుస్తకాలు చదవడం వల్లో మరో మంచి లక్షణం కూడా పవన్‌కు అబ్బిందని అంటున్నారు పరిశీలకులు.
అదే.. ఎన్నికల్లో గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ.. ప్రజారాజకీయాలు చేయడం.
మరి ఇన్ని మంచి లక్షణాలు ఏర్పరుచుకున్న పవన్.. ఆచరణలోకి వచ్చే సరికి కొన్ని విషయాల్లో మాత్రం పారదర్శకతకు పెద్ద పీట వేయలేక పోతున్నారనే వాదన ఉంది. ముఖ్యంగా ప్రస్తుత జగన్ ప్రభుత్వంపై పవన్ ఒంటికాలిపై లేస్తున్నారు. కేంద్రానికి కూడా జగన్‌పై ఫిర్యాదులు చేశారు. ఇసుకపై లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇక, తెలుగు మీడియంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఈ క్రమంలోనే ఇప్పుడు మన నుడి(అంటే తెలుగు భాషపై)-మన నది పేరుతో పెద్ద ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. మంచిదే. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉద్యమాలు చేయొచ్చు. ప్రజలను కలుపుకొని పోవచ్చు. కానీ, ఇలాంటి ఉద్యమాలు చేసే సమయంలో పవన్ చెప్పే పారదర్శకతలు ఏమవుతాయనేదే ప్రధాన ప్ర శ్న. గతంలో ఇందిరా గాంధీ ఈ దేశాన్ని పాలించే సమయంలో భూపరిమితి చట్టంపై రాజ్యసభలో ప్రసంగించాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పటి కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య.. నెల్లూరులోని తన భూములను, పొలాలను పేదలకు పంచి వెళ్లి దీనిపై మాట్లాడారు.
మరి తెల్లారిలేస్తే.. ఆదర్శం అంటూ జబ్బలు చరుచుకునే పవన్.. నుడి విషయంలో తన పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో.. నది విషయంలో టీడీపీ అధినేత సీనియర్ మోస్ట్ రాజకీయ నేత చంద్రబాబు కృష్ణానది గర్భంలో ఉన్న ఇంటిలో ఎలా ఉంటున్నారో? కూడా తనను తాను ప్రశ్నించుకుని, సరిచేసుకుని తర్వాత ఇలాంటి ఉద్యమాలు చేస్తే బటర్ అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ ఆ దర్శం జగన్‌పై పోరాడేందుకు మాత్రమే పనిచేస్తుందో..? ప్రశ్నించేందుకే పరిమితమవుతుందో చూడాలి..!