సొమ్మెవరిది.. సోకులెవరు పడుతున్నారో తెలుసుకోండి లక్ష్మణ్ : కేటీఆర్

సొమ్మెవరిది.. సోకులెవరివో.. లెక్కలు తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రజాగోస- భాజపా భరోసా యాత్రలో భాగంగా లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. సొమ్ము కేంద్రానిది.. సోకు తెరాసదంటూ లక్ష్మణ్ చేసిన కామెంట్స్‌పై ఆయన ట్విటర్ వేదికగా స్పదించారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్రం వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని ట్విటర్‌లో కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.

‘‘ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు? తెలంగాణ సొమ్ముతో లక్ష్మణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబ్ యూపీ సోకులు పడుతోంది. దేశ అభివృద్ధికి  దోహదపడుతున్నందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలపాలి. కరవు పీడిత నేలగా ఉన్న తెలంగాణ.. ఇవాళ 1.35 కోట్ల ఎకరాల మాగాణం అయింది. నాడు నెర్రెలు బారిన నేల.. నేడు పచ్చదనంతో కళకళలాడుతోంది. రైతుబంధు, 24 గంటల విద్యుత్‌తో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంది. లెక్కలు తెలుసుకోండి లక్ష్మణ్‌.. అంతేకానీ ప్రజలను మభ్యపెట్టొద్దు’’ అని ట్విటర్‌లో కేటీఆర్‌ వెల్లడించారు.