తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినవారందరికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ట్విటర్ వేదికగా భావోద్వేగకరమైన పోస్టు చేశారు. మూడేళ్ల క్రితం తన పుట్టిన రోజున ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం తనకు ఎంతో తృప్తినిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒక్కడిగా ప్రారంభించిన ఆ కార్యక్రమంలో తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులంతా భాగమై తమకు చేతనైనంత సాయం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా.. “గిప్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్ధులకు బైజ్యూస్ సాప్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్, స్టడీ మెటీరియల్‌ను కేటీఆర్ అందించారు. పోటీ పరీక్షలకు అదనపు మెటీరియల్‌గా ఉపయోగపడుతుందని ట్విటర్లో పేర్కొన్నారు.
పలువురికి ఉపయోగపడేట్లు జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్న ఆలోచనతో మూడేళ్లు క్రితం “గిప్ట్ఏస్మైల్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. గిప్ట్ ఏ స్మైల్ కింద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తికరంగా, గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. అందరి ప్రేమ,ఆప్యాయతలకు శాశ్వతంగా కృతజ్ఞుడనని కేటీఆర్ అన్నారు.