కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

-

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు కేటీఆర్.    దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరోనా పైన పరిమితులు సడలించడం, పెరుగుతున్న ఎకనామిక్ ఆక్టివిటీ మొదలైన అంశాల కారణంగా నాలుగవ త్రైమాసికంలో ఎంఎస్ఎంఈ పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభిం చాలంటే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు అవసరమని కేటీఆర్ తెలిపారు.

గత ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయన్నారు. కరోనా, లాక్డౌన్ వలన ఈ ఎంఎస్ఎంఈ లు గత ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయని, దీంతో వాటి యొక్క పరిస్థితి దీనంగా మారిందన్నారు.

పరిశ్రమల కార్యకలాపాల పైన లాక్డౌన్ సమయంలోనూ తెలంగాణ ఇలాంటి పరిమితులు విధించలేదని అయితే ఈ ఎంఎస్ఎంఈ లకు అవసరమైన ముడి సరుకుల సరఫరా ఇతర రాష్ట్రాల నుంచి సరైన సమయంలో అందకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు తిరిగి వెళ్ళిపోవడం, ఎం ఎస్ ఎం ఈ లు తయారు చేసిన తమ ఉత్పత్తులను తన కస్టమర్లకు అందించడంలో ఎదుర్కొన్న రవాణా ఇబ్బందుల వంటి కారణాల వలన  వాటి కార్యకలాపాలు స్తంభించిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

ఇలా ఎలాంటి రాబడులు లేని సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈ ల రుణాల చెల్లింపు పైన వచ్చే ఏడాది మార్చి 31 వరకు మారటోరియం విధించడం, అప్పటిదాకా రుణాల పైన వడ్డీని ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకుంటే ఆయా ఎంఎస్ఎంఈలకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి మద్దతు అందించగలిగితే కరోనా కన్నా ముందు ఉన్న పూర్వస్థితికి ఎంఎస్ఎంఈలు చేరుకుంటాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచిస్తున్న ఈ సహాయక చర్యలు వెంటనే చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్ నిర్మల సీతారామన్ కి  తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news