గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం గులాబీ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా హైదరబాద్‌లో ఉన్న రాజకీయ, సామాజిక సమీకరణాల లెక్కలు బయటకు తీస్తోంది. పదవుల పంపకాలు మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో ఏ ఏ సామాజిక వర్గాలు ప్రత్యర్ధి పార్టీల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందో అంచనాలు వేస్తోంది టీఆర్ఎస్.ఇందులో భాగంగా ఆర్య వైశ్య సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు సరికొత్త ఎత్తులు వేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, గోషామహల్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్యవైశ్య సామాజికవర్గం ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. అంతేకాదు.. GHMCలోని మొత్తం 150 డివిజన్లలో దాదాపు 30 డివిజన్లలో ఆర్యవైశ్య ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారట. అందుకే ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడని అధికార పార్టీ ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది.
టీఆర్ఎస్లో ఈ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే గణేష్ బిగాల ఉన్నారు. ఇదే వర్గానికి చెందిన కోలేటి దామోదర్ గుప్తా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఒక టర్మ్ పదవీకాలం ముగియగానే దామోదర్‌కు మళ్లీ పొడిగించారు. ఇప్పుడు ఇదే ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన మరో ముగ్గురికి పదవులు కట్టబెట్టారు సీఎం కేసీఆర్. గవర్నర్ కోటాలో బోగారపు దయానంద్‌ను ఎమ్మెల్సీని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ను చేశారు. ఇదే సామాజికవర్గానికి చెందిన ఉప్పల శ్రీనివాస గుప్తను తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ను చేశారు.
ఇలా ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురుకి పదవులు కట్టబెట్టడంతో రాజకీయ వర్గాలతోపాటు టీఆర్ఎస్లోనూ చర్చ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆర్యవైశ్యులకు పెద్దపీట వేశారని అనుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో వ్యాపార వర్గాలకు దగ్గరయ్యేందుకు చేసిన ఈ ప్రయత్నం వర్కవుట్ అవుతుందని పార్టీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. పైగా పదవులు పొందిన ముగ్గురూ తమ సామాజికవర్గంలోని వివిధ కమిటీలలో చురుకుగా ఉంటున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్యవైశ్య సామాజికవర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈసారి ఆ వర్గం ఓట్లు అటు వెళ్లకుండా చెక్‌పెట్టడం ఒక ఎత్తు అయితే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోందట టీఆర్ఎస్. అందుకే సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం. మరి.. అధికారపార్టీ వేసిన ఈ వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.