తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నారు. ఇంట్లో కింద పడి కాలికి గాయం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీలో ఏవైనా మంచి సినిమాలుంటే చెప్పమని ఇటీవలే ట్వీట్ చేసిన కేటీఆర్.. ఇప్పుడు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయడానికి గల కారణం కొందరి కామెంట్లే అనిపిస్తోంది. ఎందుకంటే..?
రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కాలికి.. ప్రమాదవశాత్తు గాయమైంది. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు మూడు వారాల విశ్రాంతి సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్.. ఆయన అభిమానులతో ట్విటర్ వేదికగా తెలిపారు. తన జన్మదినానికి ముందు రోజునే ఇలా జరిగింది. అయితే.. విశ్రాంతి సమయంలో చూసేందుకు ఓటీటీలో ఏవైనా మంచి సినిమాలు, సిరీస్ లు సూచించాలని ఆయన ట్విటర్ వేదికగా అభిమానులను కోరారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
చాలా మంది నెటిజన్లు తమకు నచ్చిన సినిమాలు, సిరీస్ ల పేర్లు సూచించారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, జీ5 కూడా తమ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సినిమా పేర్లను సూచించాయి. ఆహా ఓటీటీ ఏకంగా.. తమ యాప్ లో ప్రసారమవుతున్న డీజే టిల్లు చూస్తే గాయం త్వరగా నయమైపోతుంది చెప్పింది. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం కేటీఆర్ ట్వీట్ పై మండిపడ్డారు. గాయపడి ఇంట్లో ఉంటే విశ్రాంతి తీసుకోవడమేంటి.. వర్క్ ఫ్రం చేయొచ్చుగా అని రీట్వీట్ చేశారు.
ఇలా సినిమాల గురించి అడగటాన్ని కొంతమంది వ్యతిరేకించారు కూడా. మరికొంత మంది మాత్రం ఇవేవి కాకుండా వాళ్లకు తెలిసిన మరిన్ని సూచనలు చేశారు. అయితే అందులో.. క్షేత్రస్థాయికి వెళ్లలేకున్నా వర్క్ ఫ్రం హోం చేయొచ్చన్న సూచన కూడా ఉంది. కట్ చేస్తే.. మంత్రి ఈరోజు దస్త్రాలను పరిశీలిస్తున్న ఫొటోను ట్విటర్లో పంచుకుంటూ.. వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లు తెలిపారు. ఇదంతా చూస్తుంటే.. నెటిజన్ల నుంచి వచ్చిన వర్క్ ఫ్రం హోం సలహాలను మంత్రి కేటీఆర్ తీసుకున్నట్టే కనిపిస్తోంది.
Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j
— KTR (@KTRTRS) July 26, 2022