జనసేన పార్టీకి రాజీనామా చేసిన సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ రాజకీయంగా ఏ అడుగులు వేస్తారు…? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో అడుగుపెట్టి, రైతులతో, యువతతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత అన్నీ ఆలోచించుకుని జనసేన పార్టీలో జాయిన్ అయి… గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసారు.
అంత వరకు బాగానే ఉంది గాని… ఆ తర్వాత ఓటమి పాలైన ఆయన జనసేన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. ఇసుక సమస్య కోసం విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కోసం ఆయన ఆసక్తి చూపించలేదు. అటు జనసమీకరణ విషయంలో కూడా ఆయన నుంచి సహకారం అందలేదు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.
దీనితో ఆయన ఏ విధంగా అడుగులు వేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. అయితే ఆయన్ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి బిజెపి రాజ్యసభకు పంపిస్తుంది అని… ఆయన ఆ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. ఈ ఏడాది మేలో ఇది జరుగుతుందని, కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు స్థానం దాదాపుగా ఖాయమై౦దని టాక్. అందుకే జనసేన పార్టీ విధివిధానాలు ఆయనకు రెండేళ్ళ తర్వాత నచ్చలేదని అంటున్నాయి రాజకీయ వర్గాలు.