ఆర్జేడీ నేత అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. భూ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆస్తులలో న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని నివాస గృహంతో సహా ఢిల్లీ మరియు పాట్నాలోని లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉండగా.. ఉద్యోగ భూముల కుంభకోణానికి సంబంధించి సీబీఐ.. సోమవారం తన తాజా ఛార్జిషీట్‌లో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి పేర్లను తీసుకున్న ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన ఆరు కోట్ల విలువైన ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది. ఈ కేసులో 2022లో లాలూపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కూతుళ్లు మీసా భారతి, హేమా యాదవ్‌లపై ఈ కేసు బుక్కైంది. భారతీయ రైల్వే లో ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి లాలూ ఫ్యామిలీ భారీ స్థాయిలో భూముల్ని తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులకు మేలు చేసేందుకు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన పదవిని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ తన దర్యాప్తులో పేర్కొంది. ఎటువంటి నియామక ప్రక్రియ చేపట్టకుండా.. బీహార్‌కు చెందిన యువతకు గ్రూపు డీ పోస్టుల్ని కేటాయించినట్లు లాలూపై సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ముంబై, జబల్‌పుర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్ జోన్లలో బీహారీలకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్ష చదరపు గజాల స్థలాన్ని కేవలం 26 లక్షలకే లాలూ ఫ్యామిలీ సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది.