రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెడ్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సర్కారు ఇప్పటికే లేఖ రాసింది.
ఉభయసభలు ఇంకా ప్రొరోగ్ కాకపోవడంతో గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగానే ఈమారు కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపరుస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని మరోసారి తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాదులంతా కలిసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.