కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబితాతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొందరేమో బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తుంటే.. మరికొందరు సైలెంట్‌గా పార్టీ మార్చేస్తున్నారు. తనకు టికెట్ నిరాకరించడంతో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి ఇవాళ పార్టీని వీడారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బెళగావి జిల్లాలోని అథని నియోజకవర్గానికి మూడు సార్లు ప్రాతినిథ్యం వహించిన లక్ష్మణ్ .. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత మహేశ్ కుమతల్లి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మహేశ్ బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో బీజేపీ.. అథని స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్‌కు కేటాయించింది. దీంతో అసంతృప్తికి లోనైన లక్ష్మణ్.. నేడు పార్టీకి రాజీనామా చేశారు.