తమిళ స్టార్ హీరో.. దళపతి విజయ్ తన నెక్స్ట ఫిల్మ్ లియో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందుకోసం చిత్రబృందం గడ్డకట్టించే చలిలో షూటింగ్ చేసింది. 56 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ కు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. కశ్మీర్ షెడ్యూల్లో తమ సిబ్బంది ఎంతలా కష్టపడిందో వారి మాటల్లోనే చూపించారు.
“కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో లియో షూటింగ్ జరిగింది. ప్రధాన క్రాఫ్ట్స్ అన్నీ పనిచేశాయి. అయితే కశ్మీర్లో షూటింగ్ కావడంతో మైనస్ 10 డిగ్రీల టెంపరేచర్లో పనిచేయాల్సి వచ్చింది. చలికి వణికిపోతూనే షూటింగ్ వర్క్ కొనసాగించారు. రాత్రి పగలు షూటింగ్ కొనసాగింది. ముఖ్యంగా అక్కడి చలి, మంచు, వర్షానికి ఏమాత్రం ఆగిపోకుండా షూటింగ్ పనులు నిర్వహించారు” అని మేకర్స్ తెలిపారు.
‘లియో’ చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్‌పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్ పళనిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19న లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.