సిద్దిపేట జిల్లాలో చిరుతపులుల సంచారం

-

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చిరుతపులుల సంచారంతో అలజడి చెలరేగింది. ధర్మారం-కొండరాజుపల్లి గ్రామాల మధ్య చిరుతపులులు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రివేళ తిరుగుతున్న చిరుతపులులను చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయపడ్డారు. వాటికి కనిపించకుండా దాక్కొన్ని ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోకు తెగ లైక్‌లు, షేర్‌లు వస్తున్నాయి.

ఈ విషయం అక్కన్నపేట పోలీసుల దృష్టికి వెళ్లింది. ధర్మారం-కొండరాజుపల్లి గ్రామస్థులు తమకు చిరుతపులుల సంచారం గురించి చెప్పారని అక్కన్నపేట ఎస్సై తెలిపారు. ఈ విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వారు వీలైనంత త్వరగా గ్రామంలో పర్యటిస్తారని చెప్పారు. అటవీ అధికారులు చిరుతపులులను త్వరలోనే పట్టుకుంటారని అన్నారు.

మరోవైపు పులుల సంచారంతో ఇరు గ్రామాల ప్రజలు భయానికి గురయ్యారు. రాత్రి పూట అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదని తీర్మానించుకున్నారు. ముఖ్యంగా పిల్లలను అటవీ ప్రాంతంవైపు ఒంటరిగా పంపించొద్దని గ్రామపెద్దలు సూచించారు. అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news