ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులను ఇలా రీయూస్ చేసేద్దామా..!

-

ప్లాస్టికి వాడకం నిషేదం..కానీ చెప్పినా ఎవరూ వినరు..బాటిళ్లు, డబ్బాలు, కప్పులు ఇలా చాలా వరకూ ప్లాస్టిక్ వస్తువులనే వాడేస్తుంటారు. ఇవి పాతబడిపోయిన తర్వాత పారేయలేక ఇంట్లోనే పెట్టుకుంటుంటారు. పర్యావరణానికి హాని కలిగించే ఈ వస్తువులను బయటపడేయటం కంటే..ఇంట్లోనే రీయూస్ చేసుకోవచ్చు. ఎలా అంటారా..?

పెన్‌ హోల్డర్‌గా..

చిన్నారులు పెన్నులు, పెన్సిళ్లు, స్కెచ్‌లు వంటివన్నీ ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు. కాస్త సమయం వెచ్చిస్తే ప్లాస్టిక్‌ కప్పులు, కూల్‌డ్రింక్‌ బాటిళ్లను అందమైన పెన్‌స్టాండ్‌గా మార్చేయచ్చు. కూల్‌డ్రింక్‌ బాటిల్‌ను సగానికి కత్తిరించి దాన్ని పెన్నులు పెట్టడానికి ఉపయోగించవచ్చు. కప్పులనైతే చక్కగా పెయింటింగ్‌ వేసి లేదా అందమైన గిఫ్ట్‌ర్యాపర్‌ చుట్టి పెన్నుల స్టాండ్‌గా మార్చేయొచ్చు.

ప్రాజెక్టు వర్కుల కోసం..

స్కూల్లో చిన్నారులకు కొన్ని ప్రాజెక్ట్‌ వర్కులు ఇస్తుంటారు. ఆ సమయంలో అవసరమైన వాటి కోసం స్టేషనరీ షాపులకు వెళ్లాలి. అయితే వాటికి బదులుగా ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగించుకోవచ్చు. వాటిని ఉపయోగించి వివిధ రకాల వస్తువులను తయారుచేయడంపై యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలున్నాయి.. వాటిని ఫాలో అయిపోయి కొన్ని ప్రాజెక్టులను డిఫరెంట్ గా చేసేయొచ్చు. అందమైన ఫ్లవర్‌వాజులు, పూలను సైతం ప్లాస్టిక్‌ వస్తువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

బర్డ్‌ ఫీడర్‌గా..

ఇంట్లో పక్షులను పెంచుకోవడం చాలామందికి సరదా. అయితే వాటికి ఆహారం వేసే విషయం కొన్నిసార్లు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎదురు కాకూడదనే చాలామంది బర్డ్‌ ఫీడర్లను ఉపయోగిస్తారు. అయితే వీటిని కొనాలంటే అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సిందే. కానీ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే వీటిని తయారుచేసుకోవచ్చు. అందుకోసం యూట్యూబ్‌ వీడియోలు చూస్తే మీకే ఐడియా వస్తుంది.

కాయిన్‌ బాక్స్‌..

కొంతమంది రూపాయి, రెండు రూపాయల నాణేలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు. అవసరమైనప్పుడు వాటిని వెతుక్కొంటూ ఉంటారు. బయటకువెళ్తుంటే..కాస్తోకూస్తో చిల్లర ఉండాలి..లేదంటే పెద్ద ఇబ్బందే..అలాంటప్పుడు ఇంట్లో చిల్లర డబ్బులను ఎక్కడపడితే అక్కడ వేయకుండా..ఓ ప్లాస్టిక్‌ కప్పులో, కాయిన్‌ పట్టేంత మూతి ఉన్న బాటిల్లో వీటిని వేయచ్చు. లేదంటే.. ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌ను తీసుకొని దాన్ని మెడ వరకు లేదా కాయిన్‌ పట్టేంత వరకు కత్తిరించి దానిలో నాణేలు వేసుకోవచ్చు.

గార్డెనింగ్‌ చేయచ్చు..

మొక్కలకు నీరందించేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిని పాటించడం మనకు తెలిసిందే! అయితే దీన్ని పెరట్లో ఏర్పాటు చేసుకోవడం కష్టమే. కానీ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతోనే మనం దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం ప్లాస్టిక్‌ బాటిల్ అడుగుభాగానికి అతి సన్నని రంధ్రం చేసి దానిలో నీటిని నింపి మొక్క మొదళ్లలో ఉంచితే సెట్.
ఇలా మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను ఒక్కదాన్ని అయినా..రీయూస్ చేయడానికి ట్రై చేయండి. కొని తెచ్చుకున్న వస్తువులకంటే..మనం తయారుచేసే ఇలా వాడే వస్తువులతో భలే ఆనందం వస్తుంది. ఇంటికి ఎ‌వరైనా వచ్చినా కూడా..మీ క్రియేటివిటీ చూసి మెచ్చుకోకమానరు..!

Read more RELATED
Recommended to you

Latest news