ఉత్తరాలు ఎన్నో మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. టెక్నాలజీ, ఫోన్లు అందుబాటులో లేనప్పుడు బంధువులు, మిత్రులు తమ సన్నిహితులకు ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాల ద్వారానే క్షేమ సమాచారాలు తెలుసుకునేవారు. ముఖ్యంగా అభిమానులు తమకు నచ్చిన సినీ నటీనటులకు ఉత్తరాలు రాసి వారి సంతకంతో ఉన్న పోటోలు పంపాలని ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. సినీ హీరోల నుంచి వచ్చిన ఫోటో, సంతకాన్ని ఎంతో భద్రంగా దాచిపెట్టుకునే వారు. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఏఎల్‌టీ అనే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ కో-ఫౌండర్‌గా కొనసాగుతున్న శామ్ జావేద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 15 ఏళ్ల కిందట చనిపోయిన తన ఆంటీకి సంబంధించిన చిన్న అంశాలు తన ఫాలొవర్స్‌తో పంచుకున్నారు. అది చూసిన నెటిజన్స్ పాత జ్ఞాపకాలను నెమర వేసుకుంటున్నారు.
ఏఎల్‌టీ ఫ్యాక్ట్ చెకింగ్ వైబ్‌సైట్ కో-ఫౌండర్ శామ్ జావేద్ ఆంటీ మెహరున్నీసా నజ్మా 2006లో కన్నుమూశారు. ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులు మేనకొడలైన శామ్ జావేద్ దగ్గర ఉన్నాయి. అయితే, ఇటీవల కొన్ని సామన్లు వెతుకుతుంటే ఆమెకు ఒక ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బమ్‌ను చూసిన శామ్ చాలా ఆసక్తిగా పరిశీలించింది. అందులో కొందరు సినీ తారలు పంపించిన ఉత్తరాలు ఉన్నాయి. వాటిని చదివిన శామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆంటీ నజ్మాకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూసి ఊరుకోకుండా.. అందులో నటించిన తారలకు ఉత్తరాలు కూడా రాసేవారు. అలా తను రాసిన ఉత్తరాలకు సినీతారలు ఫోటోలతోపాటు సంతకం చేసి పంపేవారు. వాటిని నజ్మా ఎంతో జాగ్రత్తగా భద్రపరిచేది.
ఎల్విస్ ప్రెస్టీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన షమ్మీ కపూర్ ఇంగ్లీష్‌లో.. ‘‘మీరు నా అభిమాని అని తెలిసి చాలా సంతోషంగా ఉంది.’’ అని ఉత్తరం రాసింది.. ఆయనతోపాటు ధర్మేంద్ర, సునీల్ దత్, కామినీ కౌశల్, సాధన, ఆశాపరేఖ్, సైరాబాను, తబస్సుమ్, సూరయ్య, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కనేనన్ని సినీ తారల నుంచి వచ్చిన ఉత్తరాలు కనిపించాయి. నజ్మా ఢిల్లీలో పుట్టారు. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో మేనత్త ఇంటి దగ్గరే పెరిగింది. నజ్మాకు సినిమాలంటే మహా ఇష్టం. సిలోన్ రేడియోలో పాటలు వినడం, అభిమాన నటుడికి ఉత్తరాలు రాయడం అలవాటు. ప్రస్తుతం బాలీవుడ్ తారలంతా ఆ ఉత్తరాలను చూసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పలువులు కామెంట్లు కూడా పెడుతున్నారు.