ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా మంత్రి పదవి నుంచి తొలగించబడ్డ ఈటల రాజేందర్, కాషాయ కండువా కప్పుకుని హుజూరాబాద్‌లో రాజకీయాలని వేడెక్కించారు. అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కేసీఆర్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తన రాజీనామాతో హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అయితే ఈ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాకముందే.. అన్ని పార్టీలు హుజూరాబాద్ లో పాగ వేశాయి. ప్రచారం కూడా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కాకముందు ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ ను క్షమాపణలు కోరుతూ ఓ లేఖ రాశాడు అంటూ.. ఉదయం నుంచి ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాను చేసింది తప్పేనని.. సమావేశాలు జరిపింది నిజమేనని.. తనతోపాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన నాయకులు కూడా ఉన్నారనీ… ఈటెల అంగీకరిస్తూ కెసిఆర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 20 ఏళ్లుగా తమ్ముడిలా రాజకీయాల్లో సీఎం కేసీఆర్ తనను ప్రోత్సహించారని.. కొందరు తప్పుదోవ పట్టించడం వల్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని ఆ లేఖలో ఈటెల ఒప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ లేఖ నిజంగా ఈటల రాశాడా? లేక ఎవరైనా నా బురదజల్లే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో పెట్టారా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అయితే దీనిపై స్పందించిన ఈటల వర్గం… ఆ లేఖ అబద్ధమని దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చింది.