ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పాసుపాడు లో భర్తను చంపిన వివాహితకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను ఆ మహిళ పక్కన పెట్టింది.వివాహేతర సంబంధం మోజులో పడింది.చివరికి పరాయి సంబంధాల వ్యామోహంలో పడి భర్తను అంతమొందించింది.దాదాపు 5 సంవత్సరాలు గా సాగుతున్న విచారణ తర్వాత నిందితురాలికి కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది.గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పాసుపాడుకి చెందిన నల్లబోతు నరేంద్ర అనే వ్యక్తికి అతడి బంధువుల అమ్మాయి అయిన శ్రీవిద్య తో గతంలో వివాహం అయింది.
శ్రీవిద్య ప్రైవేట్ పాఠశాలలో టీచర్, కాగా నరేంద్ర వాచ్మెన్ గా పని చేసేవాడు.శ్రీవిద్య పెళ్లికి ముందు నుంచే తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య తో వివాహేతర వ్యవహారం నడిపింది.పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆ వ్యవహారం అలాగే కొనసాగింది.ఈ విషయం కొన్నాళ్ళకు నరేంద్రకు తెలిసింది అతడు మందలించాడు.దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.వీరయ్య శ్రీవిద్య, ఇద్దరూ కలిసి అతడి హత్యకు ప్లాన్ వేశారు.ముందస్తు ప్రణాళిక ప్రకారం 2017 డిసెంబర్ 19న భర్తకు తన బావతో శ్రీవిద్య ఫోన్ చేయించింది.నరసరావుపేటలోని ఓ బార్ కి నరేంద్రని రప్పించారు.అక్కడ వీరయ్య కొందరు నిందితులతో కలిసి వేచి చూస్తున్నాడు.నరేంద్ర రాగానే అతడికి మందు తాగించి, అనంతరం ఓ బాకీ వసూలుకి రావాలంటూ నరేంద్ర ను వారు తమ కారులో తీసుకువెళ్లారు.
మార్గంమధ్యలో అతడికి సైనైడ్ కలిపిన మందు తాగించారు.దీంతో నరేంద్ర ప్రాణాలు విడిచాడు.మృతదేహాన్ని ఓ కాలువ పక్కన పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పక్కనే పురుగుల మందు డబ్బా ఉంచారు.నరేంద్ర తండ్రి దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి.