శీతాకాలం మొదలైంది. తెల్లవారుజామున లేవాలంటే వెన్నులో వణుకుపుడుతోంది. ఇక వేకువజామునే పనులకు వెళ్లేవారి సంగతి వేరే చెప్పనక్కర్లేదు. చలిలో గజగజ వణుకుతూ తమ పనులకు బయలుదేరుతున్నారు. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీోలని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా చలితో వణికిపోతోంది. రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో బుధవారం 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి ఎం.సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం 13 డిగ్రీల వరకు నమోదు కాగా, బుధవారం ఒక్కసారిగా తగ్గింది. పాడేరు మండలం మినుములూరు కాఫీ బోర్డులో 10.1 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మన్యం అంతటా పొగమంచు కమ్ముకుంటోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.